ఆరేళ్లుగా తన ప్రయోగశాలలో పని చేస్తూ, తనకి మంచి మిత్రుడి గా కూడా మారిన గంగాధర్ ని ఉన్నపళంగా ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నా అని చెప్పటం గౌతమ్ కి అనుకున్న దాని కంటే కష్టంగానే ఉంది. పిలిచి కూర్చోపెట్టి పది నిమిషాలు అయినా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్న గౌతమ్ ని ఉదేశిస్తూ,
“అవును ఈ ల్యాండ్ లైన్ ఫోన్ రిపేర్ చేయించావా లేదా?” అని అడిగాడు గంగాధర్.
“లేదు రా. స్పీకర్ తోనే పని చేస్తుంది ప్రస్తుతానికి.” అని బదులిచ్చాడో లేదో, ఫోన్ రింగ్ అయింది. గంగాధర్ ని చూసి నవ్వి, స్పీకర్ ఆన్ చేశాడు గౌతమ్.
“చెప్పేశావా లేదా? షో టైం అవుతుంది. తొందరగా బయల్దేరు.” భార్య ప్రీతి గొంతు వినగానే ఉలిక్కి పడి రిసీవర్ తీశాడు గౌతమ్. కానీ స్పీకర్ ఒకటే పని చేస్తుంది అని గుర్తు తెచ్చుకొని కంగారుగా నవ్వుతూ గంగాధర్ వైపు చూశాడు.
“లేదు లేదు. అదే పని లో ఉన్నాను. వచ్చేస్తా”
“ఎంత సేపు పడుతుంది ఇంకా? తొందరగా కానిచ్చేసి రా ఆలస్యం అవుతుంది మళ్ళీ.” విసుగ్గా అంది ప్రీతి.
“వస్తున్నా, వస్తున్నా. నువ్వు వెళ్లి కూర్చో లోపల.” ఇంక ఆలస్యం తగదు అని అర్ధం అయింది గౌతమ్ కి.
“ఎం మనిషో ఏంటో! ఎందుకు చేసుకున్నాన్రా దేవుడా!” స్పష్టంగా వినిపించేలా గొణుగుతూ ఫోన్ పెట్టేసింది ప్రీతి.
ఆ మాటలు వినిపించినా, వినిపించనట్లు నవ్వుతూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు గౌతమ్, గంగాధర్.
“ఏంట్రా విషయం? ఎందుకు రమ్మన్నావు? చెప్పు ఫర్వాలేదు?” చనువుగా అడిగాడు గంగాధర్.
తాను ముందుగానే ప్రాక్టీసు చేసినట్లుగా మొదలు పెట్టాడు గౌతమ్, “చూడరా గంగా, నాకు ఎలా చెప్పాలో అర్ధం కావటం లేదు. కాబట్టి సూటిగా విషయం లోకి వచ్చేస్తాను.” గౌతమ్ నుంచి ఇలాంటి ఫార్మల్ మాటలు గంగాధర్ కి కొంచెం కొత్తగా అనిపించాయి.
“నువ్వన్నా, నీ పనితనం అన్నా, నాకు, ఈ ల్యాబ్ లో పని చేసే ప్రతి ఒక్కరికి, ఎంత గౌరవమో నీకు బాగా తెలుసు. కానీ గత కొద్ది నెలలుగా నీ రిపోర్ట్స్ మీద చాలా ప్రతికూల వ్యాఖ్యలు వస్తున్నాయి. ఈ విషయం నీకూ తెలుసు అనే అనుకుంటున్నాను. ఇంక తప్పక ఒక నిర్ణయానికి వచ్చాము.” గౌతమ్ ఎం చెప్పబోతున్నాడో అర్ధం చేసుకున్న గంగాధర్, ఎం చేయాలో, ఎలా స్పందించాలో అర్ధం కాక నేలను చూస్తూ ఉండిపోయాడు.
ఆ క్షణం, గదిలో వెలుగుతున్న 100W బల్బు యొక్క వెలుతురు గంగాధర్ నున్నటి బట్ట తల మీద పడి రిఫ్లెక్ట్ అవుతూ, పాపి కొండల మధ్యలో పడవ ప్రయాణం చేస్తున్నపుడు చూసిన సూర్యాస్తమయం వెలుగులా అనిపించింది గౌతమ్ కి. తనకు తెలుసు, వారు ఇరువురు ఇప్పుడు ఉన్న పరిస్థితి కి కారణం ఆ బట్టతలే అని.
“నీ జుట్టు ఊడటం ఎప్పుడు మొదలైయిందో…” అని గౌతమ్ మొదలు పెట్టగానే, కోపం గా తనని చూస్తూ “నా జుట్టు గురించి దయ చేసి ఏమి మాట్లాడొద్దు.” అన్నాడు గంగాధర్. వెంటనే బట్టకి ఇరువైపులా ఉన్న కాస్త జుట్టుతో తలను కవర్ చేయటానికి విఫలయత్నం చేశాడు.
“ఏమీ మాట్లాడకుండా ఎలా ఉంటానురా? ఆ బట్ట తల వల్లే కదా అంతా జరిగింది. దాని వల్లనే కదా ఈ రోజు ఈ పరిస్థితి.” తాను ప్రాక్టీసు చేసింది మరచిపోయి, మనసులో నుంచి మాట్లాడటం మొదలు పెట్టాడు గౌతమ్. తను అన్నది మాత్రం అక్షర సత్యం.
ఆరేళ్ళ క్రితం ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉద్యోగంలో చేరినప్పుడు, గంగాధర్ జుట్టు ఎంతో ఒత్తుగా, రింగులు తిరిగి, నల్లగా నిగనిగలాడుతూ, రుతుపవనాలు వచ్చి వెళ్ళాక నల్లమల్ల అడవి లాగా నిండుగా ఉండేది. అనతి కాలంలోనే తన ప్రతిభతో, ప్రవర్తనతో, సూక్ష్మ పరిశీలనలతో కూడిన ఆటాప్సీ (autopsy) రిపోర్ట్స్ తో అందరి మన్ననలు పొందాడు. ఉద్యోగంలో చేరిన మూడేళ్ళకి పల్లవి ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత నలుగుర్ని హత్య చేసి, ఒక మేకని మానభంగం (Goat Rape) చేసిన ‘ఆదిభట్ల సాల్మన్’ కేసులో కీలక రిపోర్ట్ ఇచ్చి ఏకంగా కమీషనర్ నుంచి ప్రశంశా పత్రాన్ని కూడా అందుకున్నాడు. ఆ కేసులో గంగాధర్ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పటికీ జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్స్ ఒక కేసు స్టడీ లా భావిస్తారు. ఎవరికీ కనిపించని ఒక చిన్న మచ్చ కుడి కాలి బొటనవేలి మీద చూసి గంగాధర్ ఇచ్చిన క్లూ వల్ల సాల్మన్ ని ఇట్టే పట్టుకోగలిగారు పోలీసులు.
(వివరణ: మనిషి బొటనవేలి మీద మచ్చ. మేకది కాదు. నిజానికి ఆ మేక మానభంగానికి గంగాధర్ కి సంబంధం లేదు. మేక సంగతి అరెస్టు తర్వాత సాల్మన్ పోలీసులకి చెప్పాడు. కానీ ఆ మేకకి ఆటాప్సీ చేసినా, విషయం బయట పెట్టేసే సత్తా ఉన్న వాడు గంగాధర్ అని అందరూ నమ్మారు. మనిషైనా, మేకైనా గంగాధర్ ప్రతిభ అలాంటిది మరి).
కానీ, ఎప్పుడైతే తన తల మీద జుట్టు రాలటం మొదలయిందో, అప్పటి నుండే గంగాధర్ తల రాత కూడా మారిపోవటం మొదలయింది. తన ప్రవర్తనలో మార్పులు ఎవరూ గమనించక ముందే తన రిపోర్ట్స్ లో కొన్ని కొన్ని వింతైన మార్పులు గౌతమ్ గమనించాడు. కేసుతో ఏ మాత్రం సంబంధం లేకుండా, మృతదేహం జుట్టు ఎలా ఉంది, నెత్తి మీద చర్మం ఎంత ఆరోగ్యంగా ఉంది వంటి విషయాలు రిపోర్ట్స్ లో ప్రస్తావించటం మొదలు పెట్టాడు గంగాధర్. అప్పటికి ఇది అంత పెద్ద విషయం అనుకోలేదు గౌతమ్. అదే పొరపాటు అయిపోయింది.
సరిగ్గా మూడు నెలల క్రితం, 42 ఏళ్ళ వయసు గల వ్యక్తి విషం తాగి చనిపోతే, ఆ రిపోర్ట్ లో గంగాధర్ ఇచ్చిన 11 పరిశీలనల్లో 9 కేవలం జుట్టు గురించే ఉన్నాయి. ఉదాహరణకి – కేరాటిన్ బండిల్స్ ఇన్ సెల్ స్ట్రక్చర్స్, డెన్సిటీ ఆఫ్ ఫాలికల్స్ ఇన్ ద డర్మిస్, యూమలానిన్ పిగ్మెంట్స్ వంటి వాటి గురించి వివరించినంతగా ఆ మనిషి తాగిన విషం గురించి రాయలేదు గంగాధర్. ఆ రిపోర్ట్ మొదటి డ్రాఫ్ట్ చదివిన ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, అదేదో ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ అనుకోని నవ్వాడు. తర్వాత అది అక్టోబర్ నెల అని గుర్తొచ్చి గౌతమ్ కి చివాట్లుపెట్టి వెళ్ళాడు. గంగాధర్ ని పిలిచి ఈ విషయం మీద మాట్లాడదాం అనుకున్నా, పల్లవి పుట్టింటికి వెళ్లిపోవటం వల్ల కృంగిపోతున్న మిత్రుడ్ని గౌతమ్ ఏమీ అనలేకపోయాడు.
ఆ రోజులు గుర్తు చేసుకుంటూ “నేను ముందే నీతో మాట్లాడి ఉండాల్సిందిరా. అప్పటికి, ప్రయత్నించాను కానీ కుదర్లేదు. ఇప్పుడు చూడు ఎలా అయిపోయిందో.” ఓదార్పుగా అన్నాడు గౌతమ్.
“ఎలా అయిపోయిందో నా? మళ్ళీ నా బట్ట తల గురించా అంటున్నావు?” మరో విఫలయత్నం మొదలు పెట్టాడు నెత్తి మీద గంగాధర్.
గౌతమ్ కి చిర్రెత్తుకొచ్చింది, “కాదు రా వెదవ! ఇదిగో ఇదే, నీ జుట్టు పిచ్చి గురించి అంటున్నా.”
“అంటావురా. నీకేమి? ఎన్నైనా అంటావు. అంత ఒత్తు గా జుట్టు ఉంది కదా నీకు. ఆల్ఫా కెరాటిన్ కంటెంట్ అంత వుంటే ఎవడైనా అంటాడు.” గంగాధర్ బాధ ఎలా ఉన్నా, చెప్పిన దాంట్లో వాస్తవం అయితే వుంది. ఆల్ఫా కేరాటిన్ నిండుగానే వుంది గౌతమ్ జుట్టులో.
“ఇదిగో ఇదే అంటున్నది. ప్రతి విషయానికి జుట్టు తో జెడ వేసి చూడకు.. ఐ మీన్, ముడి వేసి చూడకు.” నోరు జారీ, సవరించుకున్నాడు గౌతమ్. వినటానికి కష్టంగానే వున్నా గౌతమ్ అంటున్న దాంట్లో నిజం వుందని గంగాధర్ కి తెలుసు.
కొంత సేపు మౌనంగా వుండి “సరే ఒప్పుకుంటాను. కానీ, మరి ఉద్యోగం తీసేసే అంత నేనేం చేశాన్రా? ఉన్నది ఉన్నట్లే కదా సిద్ధం చేస్తున్నాను రిపోర్ట్స్?” చెప్పుకొచ్చాడు గంగాధర్.
“ఉన్నది ఉన్నట్లే ఉంటుంది. కావాల్సింది మాత్రం ఉండట్లేదు.”
“నేను ఒప్పుకోను. ఎంతో సూక్ష్మంగా పరీక్షించి ఇస్తాను నేను రిపోర్ట్స్ ప్రతిసారి.”
“ఇది చూడు…” ముందే సిద్ధంగా ఉంచుకున్న ఫైల్లోనుంచి గౌతమ్ ఒక రిపోర్ట్ తీసిచ్చి గంగాధర్ ని చివరి పేరాగ్రాఫ్ చదవమని చెప్పాడు. గంగాధర్ కొంచెం సంకోచిస్తూ,
“బాధితుడికి షుమారు 32-34 సంవత్సరాలు ఉండవచ్చు. శరీరం మీద పలు కత్తి పోట్ల గాయాలతో చనిపోయిన ఇతని జుట్టు మాత్రం ఎంతో వొత్తుగా వుంది. సాధారణంగా మనకి లభించే ప్లాస్టిక్ దువ్వెనతో దువ్వటం కూడా క్లిష్టంగా ఉండింది. ఇతనికి అంత ఆరోగ్యమైన జుట్టు ఇచ్చిన దేవుడు ఇంత స్వల్ప ఆయుష్షు ఎందుకు ఇచ్చాడో!”
చదవటం పూర్తవగానే గంగాధర్ విషయం పూర్తిగా అర్ధం చేసుకొని, దించిన తల ఎత్తకుండా మౌనంగా వుండిపోయాడు. చచ్చిన పాముని చంపుతూ, గౌతమ్ “ఇదా నువ్వు గౌ రక్షకుల చేతిలో 13 కత్తి పోట్లతో చనిపోయిన 34 ఏళ్ళ ముస్తఫ్ఫా గురించి ఇచ్చిన రిపోర్ట్?” అని అడిగాడు. గంగాధర్ కి మౌనమే సమాధానం అయింది. “ఏం అంటావురా? చెప్పూ!” అని నిలదీశాడు గౌతమ్.
ఎం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్ధం కాని గంగాధర్ “రిపోర్ట్ కాస్త పక్క దారి పట్టింది వాస్తవమే. కానీ…” ఆ మాటలు వినగానే గౌతమ్ అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. “పక్క దారి పట్టటం ఏమిటి రా సన్నాసి?! వాడిని 13 సార్లు పొడిచి రోడ్డు మీద చంపి పడేస్తే నువ్వు వాడి జుట్టుని ప్లాస్టిక్ దువ్వెన తో దువ్వుతావా?” గౌతమ్ లో ఇంత కోపం ఎప్పుడూ చూడని గంగాధర్ దిగ్బ్రాంతి చెందాడు. ప్రయోగశాల లో తన టైం ఇంక అయిపోయింది అన్న విషయం గంగాధర్ కి అర్ధం అయింది.
“సరేరా! ప్రయోగశాల లో నా టైం ఇంక అయిపోయింది అన్న విషయం నాకు అర్ధం అయింది. నేను వెళ్ళిపోతాను” అన్నాడు.
కుర్చీలోనుంచి లేవబోతున్న గంగాధర్ ని ఆపి గౌతమ్, “పోయిన ఆగస్టులో 7 ముక్కలుగా మన ల్యాబ్ కి వచ్చిన అమ్మాయి కేసు గుర్తుందా? నీ రిపోర్ట్ వల్లే ఎంతో తేలికగా హంతకుడిని పట్టుకున్నారు పోలీసులు.” అన్నాడు.
ఆ రోజుల్లో తనకి ఉన్న జుట్టును జ్ఞాపకం చేసుకుంటూ, “ఎంతటి మధుర జ్ఞాపకాలు రా అవి.” అన్నాడు గంగాధర్.
అప్పుడు గౌతమ్, “మనకి మాత్రమే మధురం, ఆ అమ్మాయికి కాదు.” అనేసి ఫక్కున నవ్వాడు. గంగాధర్ కి నవ్వు రాలేదు. తన ఆలోచనలు వేరే ఎక్కడో ఉన్నాయి. ఇంతలో ఫోన్ రింగ్ అయితే వెంటనే కట్ చేసేశాడు గౌతమ్.
“అవకాశం ఉన్నపుడే ఆ transplant ఏదో చేయించుకొని ఉండాల్సింది రా నేను. జుట్టు ఉండేది, పల్లవి ఉండేది, ఉద్యోగం ఉండేది. ఇప్పుడు మరీ ఆలస్యం అయిపోయింది.” నిట్టూర్చాడు గంగాధర్.
“ఇంకా జుట్టు జుట్టు అంటావ్ ఏంట్రా? నా మాట విని జుట్టు కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకు రా.” సరిగ్గా గంగాధర్ ఏదైతే అంటాడు అనుకున్నాడో అదే అన్నాడు గౌతమ్.
“ఆపరా నీ సోది ప్రవచనం. అంత ఇంపార్టెన్స్ లేకపోతే నువ్వు రేపటి నుంచి గుండు తో రారా ల్యాబ్ కి చూస్తాను. తిరుపతి కి వెళ్లొచ్చి ఆరు వారాలు పగలూ రాత్రీ టోపీ పెట్టుకొని తిరిగే నువ్వు, నాకు చెప్తున్నావా నీతులు?” ఒక్కసారిగా విరుచుకు పడ్డాడు గంగాధర్. దిగ్బ్రాంతి చెందటం ఇప్పుడు గౌతమ్ వంతు అయింది. తనలో మిగిలి వున్న సహనం కూడా కోల్పోయాడు.
“చాలురా బాబు ఇంక నీతో. నా షో టైం అవుతుంది, వెళ్లి నీ సామాను సర్దుకొని బయల్దేరు. రేపటి నుంచి ల్యాబ్ కి రావాల్సిన అవసరం లేదు. ఏదో స్నేహితుడివి కదా అని…”
“ఆపరా పెద్ద చెప్పొచ్చావు. నాకేమి అవసరం లేదు మీ జుట్టున్న వాళ్ళ జాలి, దయా, కరుణ. సమాజం లో ఎప్పుడు ఉండేదే కదా, ఉన్నవాడు లేని వాడి మీద చేసే అజమాయిషీ.” ఆ మాటల్ని గౌతమ్ ప్రాసెస్ చేసే లోపే లేచి వెళ్ళిపోయాడు గంగాధర్. సరేనని ఇంక కుర్చీలోనుంచి లేవబోతుంటే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది.
“అబ్బా! అయిపోయింది లే పని. స్టార్ట్ అవుతున్నా ఇప్పుడు.” అన్నాడు గౌతమ్ విసుగ్గా.
“నేను రంజిత్ కుమార్ మాట్లాడుతున్న.”
“ఇన్స్పెక్టర్ సర్! సారీ నా భార్య అనుకున్నాను. హ హ..”
“సరేలే కానీ, ల్యాబ్ లోనే వుంటావా, ఒక ముఖ్యమైన పని మీద వస్తున్నా నీ దగ్గరకి.”
“లేదు సర్. ఇప్పుడే వెళ్లిపోతున్నా. నా భార్య తో సినిమా చూడటా..”
“సినిమా నా? సీఎం లెవెల్ విషయం గౌతమ్ ఇది.”
“సీఎం ఆ?” షాక్ అయిపోయాడు గౌతమ్.
“సీఎం బాబాయ్ మరణం గుండెపోటు కాదు, హత్య అని అనుమానాలు బయటకి వస్తున్నాయి. బాత్రూం లో దొరికిన జుట్టు తప్ప వేరే ఏమీ ఆధారాలు లేవు ప్రస్తుతానికి. ఆ జుట్టు సాంపిల్స్ అన్నీ తీసుకొని వస్తున్నా ల్యాబ్ కి. నీ దగ్గర ఎవరైనా నిపుణుడు వుంటే చూడు.”
“….”
“గౌతమ్? ఉన్నావా? సరేలే వస్తున్నా 5 నిమిషాల్లో. మాట్లాడుకుందాం.”
“అలాగే సర్.” ఫోన్ కట్ చేసి బయటకి పరిగెత్తాడు గౌతమ్.. “గంగాధర్.. గంగాధర్” అని అరుస్తూ.
సమాప్తం